Thursday, March 29, 2012

కార్పొరేటు వల

నిన్నంతా నిట్టూర్పులు 
నేడేమో నింగినంటే ఊహలు 
ఒక్క క్షణం అయోమయం 
మరు క్షణం ఆశల వలయం

గెలుపోస్తే గొప్పలు 
లేకపోతే తిప్పలు 
ఎన్నెనో చిక్కులు 
వింతవింత తిక్కలు 

ఒడిదుడుకుల ఓడలు 
గాలిలో మేడలు 
కోటలో పాగాలు 
పూటకో రాగాలు

అరిగిపోయే ఆరోగ్యం 
అంతుచిక్కని గమ్యం  
కరిగిపోయే యవ్వనం 
తిరిగిరాని జీవితం 








Friday, March 23, 2012

అందని ద్రాక్ష చేదు

శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  చిన్నారులకు చిన్న పాటగా పాడేందుకు వీలుగా వ్రాసిన కవిత.  మనము చిన్నప్పుడు విన్న "అందని ద్రాక్షను చేదు" కధనే ఇలా వ్రాసాను. తప్పులను మన్నించ మనవి.


కధ ఒకటుంది ఊ కొడతారా!
చుక్కలు చూపుతూ చక్కగా చెబుతా
బుద్దిగ కూకోని శ్రద్దగా మీరు మాటింటారా?

చీమలు దూరని చిట్టడవంటా!
కాకులు దూరని కారడవంటా!
అక్కడ ఉందో టక్కరి నక్క
టక్కు టమారం తెలిసిన నక్క

అడవిలో ఉందో ద్రాక్షల చెట్టు
నల్లని ద్రాక్షల  పచ్చని చెట్టు 
పళ్ళను చూచి ఊరేను నోరు 
 తిని తీరాలంటూ మదిలో పోరు

ఎగిరిపట్టగా పళ్ళు అందక
నక్క గెంతెను విసుగు చెందక 
ఎంత చేసిన పళ్ళు దొరకక 
తగ్గ సాగేను ఒంట్లో ఓపిక

అలసి అలసి మనసు మారెను 
ద్రాక్ష చేదని తలవ సాగెను 
అందని ద్రాక్షను చేదని తలచెను 
ఆకలితోనే ఇంటికి చేరెను