Friday, November 25, 2011

అక్షరం

అక్షరం - అది దేవుడు మనకిచ్చిన అందమైన వరం
అనంతమైన దాని లోతు చూడటం ఎవరి తరం?
కారు చీకటిలో దారి వెతుకుతున్న మనిషికి దిశానిర్దేశకం  
గాఢ నిద్రలో ఉనికిని మరచిన సమాజానికి శంఖారావం

కత్తి కన్నా కలం గొప్పది
కాలంతోనే తలబడగలదది
మనిషి మనిషిని మార్చే మహా శక్తి అది
మహా సామ్రాజ్యాలనే కూల్చిన ఘనత గలది

చెడ్డ వాని చేతిలో మారణాయుధం
మంచివాని నోటిలో పావన హోమం
అందరి మంచికి వినియోగించ వలసినది
అక్షరం - అంటే నాశనం ఎరుగనిది  

Friday, November 18, 2011

ఇల్లు కట్టి చూడు

ఆరు అడుగల నేలకై ఆరాటం
అంతం ఎప్పుడో ఎరుగని పోరాటం
ప్రొద్దుపొడవగానే మొదలయ్యే పరుగల ప్రస్థానం
చీకటి చేరువకాగ గూటికి చేరే గుండె రవం

వీటుకై చేసిన అప్పు వేసే పోటుతో సాగే పోరు
నెలలు ఏళ్లు అయ్యినా తగ్గదు దాని జోరు
నేటి కన్నా రేపు బాగుండాలని అని ముందుకు నడిపే ఆశ
జీతం రోజు ఇంకా రాలేదని నెలంతా ఎదురుచూపులే! తెలుసా?

పెరిగే ధరలతో పాటు పెరగని జీతాల సెగ
ఇది పెద్ద కోరికలున్న ఉద్యోగి తెగ
నాకంటూ ఓ సామ్రాజ్యం
ప్రతీ మధ్య తరగతి మనిషి చేస్తున్న పోరాటం

గమనిక: వీటు అంటే తమిళంలో ఇల్లు అని అర్ధం.
ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు అని నానుడి.  

Wednesday, October 12, 2011

వివాహ వేడుక

Written recently during a friend's wedding

ఉత్సాహం కదం తొక్కుతున్న వేళ
ఊరంతా హోరుగా గోల చేస్తున్న వేళ
ఆకాశం లోని చందమామ అరచేతులలో అచ్చుపడుతున్న వేళ
చిన్నా పెద్దా తేడా లేక ఆదమరిచి చిందులేసే వేళ
స్పీకర్లలోని సంగీతం సరికొత్త సరిగమలతో అందరిని ఊరించే వేళ                 
మావిడితోరణాలు మా ఇంటికి స్వాగతం అంటూ ముచ్చటిస్తున్న వేళ
అయినవాల్లంతా అక్కునచేరి ఆనందం అందిస్తున్న వేళ
అవును ఇది వివాహ వేడుక వేళ
రెండు జీవితాలు ఒకరికొకరు బాసలు చేసుకొనే వేళ
రెండు కుంటుంబాలు ఒక కుటంబం అయ్యే వేళ

Thursday, March 31, 2011

పరిణితి - పరిపక్వత

పరిణితి పెరిగేకొద్ది పరిపక్వత పెరగనీ
పెదాలు ప్రతినిత్యం ప్రేమతోనే పలకరించనీ
చూపులే చిరునవ్వులు వెదజల్లనివ్వనీ  
చేతనైన సహాయం చేరువలోవున్నవారికి చేరనీ
నీ మేధస్సుతో జరిగే మధనం మానవాళికి మంచిని ముట్టనివ్వనీ
నీ విలాసం ఇతరులకు విలాపం కారాదన్నా విషయం విరివిగా విదితమవనీ 
అహంకారం ఆనందానికి అవరోధమన్న అక్షర సత్యం అవగతమవనీ 
ఈర్ష్యాసూయలు ఇహమున ఇక్కట్లు కలిగించునని ఇంపుగా నీ మనసులో ఇంకనీ 
పరిణితి పెరిగేకొద్ది పరిపక్వత పెరగనీ... 
పరిపక్వతోపాటు పవిత్రత పదింతలు పెరగనీ!