Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Tuesday, July 6, 2021

సమరం

కురుక్షేత్రంలో నడిచెనంట యుద్ధమొకటి పద్దెనిమిది రోజులు ఆ యుధిష్టరుడు కొరకు
కాని  యుద్ధమొకటి జరిగెనంట తన మదిలో ఒక జీవిత కాలం
అరణ్యవాసమంతా గడిపెనంట రాముడు తృటిలో 
కాని అరణ్యరోదన ఒక జీవిత కాలం మ్రోగెనంట తన ఎదలో
యుద్ధమొకటి ప్రకటించెనంట ఆ మోహన గాంధి తన చరకా యంత్రముతో 
దాని ప్రతిబింబపు యుద్ధమొకటి నడిచెనంట తన జీవిత చక్రంలో 
సహగమనమే ప్రతీ మనిషికి తను సలుపే సమరమంతా
నా యుద్ధం నా పైనే 
చేస్తున్న నాతో నేనే ఓ సమరం 
చేస్తున్న నాతో నేనే సహగమనం 

నొప్పి అనేది లేకుంటే మనిషంటే రాక్షసుడే 
మృత్యువే లేకుంటే మనమంతా అసురులమే 
నొప్పేగా మన బ్రతుకులలో వెలుగును నింపేది 
నొప్పేగా మనిషిని మనిషికి నేస్తంగా మార్చింది 
ఆశ అనేది లేకుంటే రేపు అనే మాటకి అర్ధమే లేదులే
ఆశ అనేది లేకుంటే మన ఉనికి గమనమే రాదులే   
ఆ రేపటి ఆశల ఆకర్షణ ఈ రోజు నొప్పెల ఉప్పెన కురిపిస్తే
ఈ రోజు నే నడుస్తున్న నిప్పుల బాట ఓ నొప్పుల ఉప్పెన రగిలిస్తుంటే 
రేపు అనే ఆశేగా నను ముందుకు నడిపిస్తోంది 
ఆ రేపటి ఆశల కలలో, ఈ నొప్పుల కుప్పల వలతో    
చేస్తున్నా ఓ సమరం నాతో నేను  
చేస్తున్న సహగమనం నాతో నేను 

Sunday, June 14, 2020

ఎవరు నువ్వు?

మంత్రదండాలు లేని మనిషి నేను 
బ్రహ్మాండాన్ని చదవడం మధ్యలో ఆపేసిన మూర్ఖిడిని నేను 
కానీ  వొంగి దండాలు పెట్టనని ఒట్టు వేసుకున్నాను 
కుదురుగుండాలని మనస్సుకి చెప్పి వృథా ప్రయాస చేయనన్నాను

లోకం పరిమితులెన్నున్నాయో!
పాపం నా గతి ఎటువెళుతోందో!
తాపం తీరే మార్గం ఎదో? 
మనిషికి పట్టం కట్టేదెప్పుడు?
మంచికి మనుగడ సాగేదెప్పుడు?
ఆనందానికి అవధులు ఎందుకు?
జవాబు లేని ఈ ప్రశ్నల జాబిత ఆగేదెక్కడ?

మంత్రదండాలు లేని మనిషి నేను
వొంగి దండాలు పెట్టనని ఒట్టు వేసుకున్నాను 

అనుబంధం బందీ కాను 
అనునిత్యం ప్రేమ పిపాసి నేను 
వసుదైవ కుటుంబకం నాది 
ఒంటరి జీవితం నాది 
తుంటరి మనస్సు తంటాలెన్నో 
అయినా గాని ఆగను నేను 
నత్త నడక నాది అని గేలి చేసినా 
ఉత్త మాటల మనిషి నేను అని అలుసుగ చూసినా  
అలుపెరగని బాటసారి నేను! 
చావుకి మాత్రమే బానిస నేను! 

మంత్రదండాలు లేని మనిషి నేను
కాదు!  మంత్రదండాలు 'అవసరం' లేని మనిషి నేను

 

Friday, February 21, 2020

మధ్యతరగతి మగ బ్రతుకు

Note: This poem was written more than 4 years ago but I didn't publish it in the blog. At that time,  I was the single bread winner of the two of us with so many apprehensions and worries about how to manage the show with kids etc... The piece itself is dedicated to every middle class man who is the single bread winner of the family. They hardly spend even 10% of their income on themselves. #MenToo

అరవై వచ్చే దాకా ఆఖరి రోజు వరకు చాకిరి తప్పదు
ప్రతి రక్తపు బొట్టుని చెమటగా చిందించి రూపాయిగా మారిస్తే
చెట్టుకు డబ్బులు  కాస్తాయి అనుకునే శ్రీమతులు
చెట్టుకు కాసే పండ్లకి కూడా సమయం కావాలని తెలియదు పాపం
మా అవసరాలు కూడా మీకు కనిపించవు కానీ మీరు ఆనందంగా ఉంటే చాలని మా ఉబలాటాం
వంటలో సాయం చేయలేదని గంట సేపు తిట్టినా
కంట తడి పెట్టి ఎదో కోరిక కోరినా
తంటాలు పడాలి తప్ప నోరు మెదపకూడదు
రోజు అంతా పనిచేసి ఇంటికొస్తే అక్కడ కూడా సంతోషం లేక
 మరమనుషులగ బ్రతకాలని శాపం విదిస్తే ఏవరికి చెప్పాలి మా గోడు


చివరికి మాకేంటి మిగిలేది?
"అమ్మ చాలా మంచిది - నాన్న చెడ్డోడు" అని అనుకునే కొడుకులు
కొరివి పెట్టాలి కాబట్టి, అప్పుల తిప్పలు కొడుకులకై వదిలేసే తండ్రి
అక్క చెల్లెల పెళ్ళిలు బాధ్యతలు.
తల్లిదండ్రలుతో పాటు ఉండనివ్వని భార్యలు
మీకు తెలిసినోళ్లు బాగుపడితే ఆ ఈర్ష్యకు మేమేగా బలి పశువలం
అత్త - కోడళ్ళు ఆడపడుచు - వదినలు. తోడికోడళ్లు.
మీరు మీరు కలిసికట్టుగా మసలలేక మాకేంటి శిక్షలు?
వరకట్నం వేధింపులో ఎంత మంది ఆడవారి దురాశ ఉందొ ఎవ్వరూ అడగరు
వృద్ధాశ్రమలో మగ్గుతున్న తల్లితండ్రుల స్థితిలకు ఎంతమంది స్త్రీ మూర్తులు భాద్యులో ఎవ్వరికి అవసరం లేదు
పేరుకేమో పురుషాధిక్య ప్రపంచం - అంతా బూటకం          

Friday, July 27, 2018

అసమర్ధుడి ఆవేదన

నమ్ముకున్న అక్షరం కడుపు నిండా తిండి పెట్టింది
కాని గుండె నిండా మంట మిగిలించింది
అమ్ముకున్న ఆత్మ గౌరవం అసమర్ధుడిని చేసింది
కమ్ముకున్న కారు చీకట్లు కుంపటి రగిలించాయి
వొమ్ము చేసుకున్న జీవితం వెఱ్ఱి చూపులు చూసింది

రాముడిలా బ్రతకాలని బయలుదేరితే రావణుడిలా బ్రతకలేక శాంతనవడునై మిగిలాను
మందుకొట్టి వీధుల్లో తిరగలేదు, పొందు కోసం అడ్డ దారులు తొక్కలేదు
అందరు బాగుండాలని అనుకున్నాను. ఆఖరికి ఒంటరిగా ఏడుస్తున్నాను
దేవుడు లేడు అని తెలుసుకునే సరికి ఆలస్యం అయ్యింది
జీవుడు ఉన్నాడని గుర్తించేసరికి చేయి జారి అవకాశం దాటింది

ఇది నా కధ - అసమర్ధుడి కధ
మంచివాడిగా ఓడిపోయాను - మనిషిలా మిగిలాను
ఓటమి నేర్పిన జీవిత సత్యం ఇదే
ఒక్కటే జీవితం - నీ కోసం బ్రతకడం నేర్చుకో
ఒక్కటే పాపం - ఆత్మ వంచన. గుర్తుంచుకో!



Tuesday, January 23, 2018

ఉనికి

జారి పడ్డ నిన్ను చూసి లోకం జాలిగా చూసిందని బాధ పడకు నేస్తం
గేలి చేసినంత మాత్రం చేత లేచి నిలబడలేవని అనుకోకు
ధూళి దులిపి కాలు కదిపి అడుగు పడనివ్వు
ఆగిపోయిన నిన్ను చూసి ఆగలేని కాలం నిస్సహయత అర్ధం చేసుకో
ఆగడం తెలియని నీ గుండె మీద చెయ్యి  వేసి ఆఖరిగా ఇంకొక్కసారి నడిచి చూడు

నీ ప్రతి నిట్టూర్పూ ఒక నిప్పు రవ్వ - నీ ప్రతి కన్నీరూ ఒక కర్మ ధార
నీ కదలిక ఒక ఉనికికి  ప్రతీక  - నీ నెత్తురు సత్తువ నిద్ర మత్తులో మర్చిపోకు
తల తెగని, రొమ్ము విరగనీ - జాలి, గేలి, కేళి దాటేసిన నువ్వు ఎవ్వరికి బానిస కావు
నిన్ను అయితే కొట్టగలరు, తిట్టగలరు, చెడగొట్టగలరు - కానీ నీ ఆలోచన నీ కన్నా గొప్పది
ఆ ఆలోచన అణచాలంటే అంత సులువు కాదు - అది నీకు కూడా సాధ్యం కాదు

ఎన్ని సార్లు పడిన చచ్చినట్టు లేవాలి - ఎంత బ్రతుకు బ్రతికినా చచ్చినట్టు చావాలి
ఉనికి అన్నది ఉన్న వరకు పోరాటం తప్పదు -విసుగన్నది ఉన్న వరకు ఆరాటం తీరదు
జారి పడ్డ నిన్ను చూసి లోకం జాలిగా చూసిందని బాధ పడకు నేస్తం
ఆగడం తెలియని నీ గుండె మీద చెయ్యి వేసి ఆఖరిగా ఇంకొక్కసారి నడిచి చూడు



Friday, February 24, 2017

చరిత్ర

 నువ్వు చెప్పిన చరిత్ర, నాకెందుకో ఎక్కలేదు నేస్తం
 అప్పుడెపుడో అందరూ సమానం అని చెప్పిన అన్నమయ్య
 అన్ని వదిలేసి తిరిగుతూ నిజాలు నిర్భయంగా చెప్పిన వేమన
 పంట పండిస్తూ పదం పదం పదిలం చేసుకున్న మా పోతన్న
 తెలుగు వారిని ఒక్కసారి కుదిపేసిన శ్రీ శ్రీ
 మట్టికాదు మనుషులే ముఖ్యం అన్న గురుజాడ
 గాయపడి భాదపడి గేయాలు వ్రాసిన గుర్రం జాషువా
 జనపదమే తమ పదమని పద పదమంటూ త్రోవ చూపిన ఈ తరం వాగ్గేయకారులు 
 కష్టాలకు స్పందిస్తూ ఎప్పటికప్పుడు తప్పులు ఎత్తిచూపిన వీళ్ళని  మినహాయిస్తే
నువ్వు చెప్పిన చరిత్ర, నాకెందుకో ఎక్కలేదు నేస్తం

Tuesday, January 12, 2016

మేలుకో - చేరుకో

అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని 
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని
వీలైతే విమానం లేకుంటే ధూమ శకటం
కాకుంటే కారులో లేకుంటే కాళ్ళతో 

పాకూతూ, జారూతూ, ఆగుతూ చేరుకో
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని 


అందరూ అబ్దుల్ కలాం అవ్వాలని రూలు లేదు
అలాగని దిగాలు పడి డభేల్ దిభేల్ పడ వద్దు
పిండి కొద్ది రొట్టి - శ్రమకొద్ది ఫలితం
ముందుకే గాని వెనకి కాదు నీ పయనం
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని 


కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి
కష్టపడి ముందుకెళితే మైల్ల్లైన  తరుగుతాయి
  
దూరంతో బేరమేల? ప్రయత్నం ఉంటే చాలు కద!
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని
    
గమనిక: ఈ కవిత స్వామి వివేకానందుడి పుట్టిన రోజుని పురస్కరించుకొని వ్రాయడం జరిగింది. అందుకు వారి యువతకి ఇచ్చిన నినాదంలోంచి ఈ కవితకి పేరు పెట్టాను. తప్పులును మన్నించమని మనవి.    
  
 







Monday, November 3, 2014

మధ్య భూతం

 తరిమి తరిమి కొట్టండి 
తాగుడు అనే వ్యసన్నాని 
తరిమి తరిమి కొట్టండి 
తాగుడు అనే భూతాన్ని  

రోజు కూలి ఇంటి నుండి రారాజుల ఇళ్ళ వరకు 
ఎన్నెనో కన్నీళ్ళు - అలుపు ఎరుగని గృహ హింసలు
నువ్ కూల్చిన కాపురాలు - బూడిదైన జీవితాలు 
మోడు బారి ఎండిపొయిన లెక్కలేని లేత గుండె చప్పుల్లు 

మహిళలరా! మా కంటి దివ్వెలార!
మము కన్న తల్లులార!
అమ్మలారా అక్కలారా!
ఎన్నాళ్లీ  గుండె కోత?
నడుము కట్టి పిడికిలెత్తి నడ్డి విరిచి పంపడి 
మీ బ్రతుకుల వెలుగులన్ని మీకు మీరే తెచ్చుకోండి 

గద్దెనెక్కి కూర్చున్న పెద్దలారా!
గెద్దలా మారి మధ్యంతో మభ్య పెట్టు నాయకులారా!
ఆపండి - ఈ దారుణ మోసకాండ
ఒక పక్కన ఉచితం అంటూ మరు పక్కన మధ్యపు ఏరులు
ఎన్నాళ్ళీ చిత్ర హింసలు?
చేతులెత్తి జోడిస్తాం - వినకపొతే జోడు తీసి దవడ విరిచి చూపిస్తాం 

తరిమి తరిమి కొట్టండి 
తాగుడు అనే వ్యసన్నాని 
తరిమి తరిమి కొట్టండి 
తాగుడు అనే భూతాన్ని

P.S. - These thoughts are about drinking addiction. While as a personal choice I don't take alcohol, I know there are enough people who are nothing but responsible social drinkers. I have only one request for such people - don't drink and drive.

Friday, September 5, 2014

మాతృదేవో భవ

అదేంటో అమ్మ, నాకు నచ్చిన కూర నీకు ఇష్టం ఉండదు
నాకు ఎక్కువ పెట్టాలి కదా!
అదేంటో, నాకు బాగా ఆకలి వేసిన రోజు నీకు ఆకలి సరిగ వెయ్యదు
నేను ఎక్కువ తినాలి కదా!

నువ్వు నా రెండు చక్రాల బండి ఎక్కి వెనక కూర్చున్న మొట్ట మొదటి రోజు
నీకేం కాకుండా నేను జాగ్రత్తగా నడపాలి అని నే పడ్డ తపన
పది నెలలు నన్ను మోస్తూ నాకేం కాకూడదని నువ్వు పడ్డ మనో వేదన జ్ఞప్తికి తెచ్చింది
నా పిచ్చికి నాలో నేనే నవ్వుకున్నా.  

నీ పుట్టిన రోజు ఎప్పుడో తెలిస్తే బాగున్ను 
తెలిస్తే ఏం  చేస్తావు అని అడుగుతావా?
ఏం చెయ్యను? - ఏం చెయ్యాలో నాకు తెలీదు. 
అందుకేనా నీ పుట్టిన రోజు నీకు కూడా తెలీదు?
అయినా చావు పుట్టుకలు దేవుడికైనా ఉన్నాయోమో కాని అమ్మకి లేవని నా నమ్మకం.  

అందరి కంటే నేను ఎక్కువ చిరాకు పడేది ఎవరి మీదనో తెలుసా? నీ మీదనే. 
అవును ఇంట్లో ప్రతీ వాళ్ళు నీ మీద కోపం చూపే వారే.
ఎందుకంటే అందరిని మోసే ఆ భూమాత కూడా నీ దగ్గరే సహనం నేర్చుకోవాలని నాకు చెవిలో చెప్పింది. 

ఉహా తెలిసి మొహం మీద గెడ్డం గీసే వయస్సు వచ్చిన  తరువాత నుండి 
నా ఊహా సుందరిలు, కావ్య కన్యలు, బాపూ బోమ్మలు, కలల రాకుమారిలు కోకొల్లలు 
కాని నా ప్రేమ సామ్రజ్యానికి ఏకైక మహారాణి మాత్రం నువ్వు అమ్మ 
అవును నా ప్రేమకి తోలి చిరునామా నువ్వు 
ఆ ప్రేమకి మలి మజిలి కూడా నువ్వే 

తల్లిని ప్రేమించే ప్రతీ బిడ్డకి ఈ కవిత అంకితం 

Saturday, June 21, 2014

లాంగ్ కట్

నిన్న ఒక స్నేహితుడు ఉత్తేజ్ వ్రాసి, చదివన ఒక కవిత పంపించాడు.
అసలు video కి లింక్  ఇది:
https://www.youtube.com/watch?v=Jv352avF4YA
ఆ తరువాత సామజిక అనుసందాన వేదికలో ఇది ప్రాచుర్యం పొందినట్టు అనిపించింది.  ఇది నా స్పందన

ఒక్క సారి సీటీ బస్సు ఎక్కి చూడు మిత్రమా
పదుల కిలో మీటర్లు నిలుచొని ప్రతీ రోజు ప్రయాణిస్తాం
పని చేసి పొట్ట నింపుకుంటాం - లాంగ్ కట్

ఊరిలో అమ్మ నాన్న, ఊరి గాని ఊరొచ్చి, చేమటోర్చి,
ఇరుకు ఇరుకు అద్దె ఇంట్లో చాలీ చాలని బతుకులతో ఉంటాం
మెస్సులో తింటాం, ఓవర్ టైంలు చేస్తాం ఒంటరిగా బ్రతుకుతాం - లాంగ్ కట్

కులం పిచ్చి మాకు లేదు బాస్ పెద్దోలకుందేమో 
తప్పులు చేసి, దేవుడి గుడికెల్లి హుండీలో దక్షిణేసి, రక్షించమని 
వేడుకునే బుద్ధి పెద్దలకు ఉందేమో కాని మాకు లేదు
మాది కాని డబ్బు మాకొద్దు, మా కష్టార్జితం మాత్రం మా ఇష్టం 
ఉపాది కోసం, మా భవిష్యత్ పునాదుల కోసం పడి గాపులు కాస్తున్నం బాస్  - లాంగ్ కట్

గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లి చూద్దం పద మిత్రమా
కొత్త ఉద్యోగికి చెత్త బుద్దులు ఎవరు నేర్పిస్తున్నారో
అవినీతిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో?

ఒక నిర్భయ విషాదాం జరిగితే మాలో కొన్ని వేల మంది స్పందించాం 
ఒక అన్నా పిలుపునిస్తే లక్షల మంది కదలివచ్చాం
ఐఏఎస్, ఐఐటి, ఐఐమ్, ఎంసెట్ గిమ్ సెట్, ఏదైనా కాని ముందు కెళ్ళడమే గాని వెనక్కు తగ్గం - లాంగ్ కట్

ప్రధాన మంత్రిని అడగు బాస్ మేంమేంటో, పూస గుచ్చినట్టు చెబుతాడు,
వాళ్ళ పూనుకుంటేనే ఎన్నికలో గెలిచానని
అక్కడి దాక వెళ్ళలేను షార్ట్ కట్ లో తెలుసుకుంటా అంటే మన ముఖ్య మంత్రులు, మంత్రులు అన్నాను - రెండు రాష్త్రాలు  కదా, అడిగి చూడు  - లాంగ్ కట్


Friday, April 25, 2014

హద్దు

కోరిక  దాహం తీరని వైనం
కఠినం కఠినం ఆ కాలపు జాలం
అనిచి అనిచి లోపలే దాచి ఉంచి
కుల్లునంతా మరచి కల్లా కపటం
లేదని అనుకొని తనిని తానే
మోసగించుకొనే మూర్ఖత్వం
ప్రతి మనిషీ చేసే వృథా ప్రయాసం 

ఆస్వాదించే అభిరుచి ఉంటే తప్పేముంది
అనుభవించే అత్యాశుంటే అంతెక్కడ్డుంది?
ఈ రెంటికి మధ్యన హద్దులు ఎరిగితే
ఆనందానికి అవధేముంది
శ్రమకి తగ్గ ఫలితము 
కోరుటయే ధర్మము
అడ్డ త్రోవ ప్రయాణం 
విఫలమౌట తధ్యము
నీడ వలె మన కర్మ
వెంటాడును నిరతము
ఎల్లలు ఎరుగని ఊహా జీవితం
ఎప్పటకీ మిగిలేను ఒక స్వప్నం 

Wednesday, July 24, 2013

విశ్రాంతి

ఆలోచన అంచులు దాటి వ్రాయనీ ఈ కవితని 
వెర్రి ఆశల వెలుగులో వెతుకుతున్న బ్రతుకుని 
గుండె  గూడులో దాగిన గోడుల గాధలని 
మారిన కాలం మరుగున పెట్టిన మమతలని 

ఎండమావుల వెనుక పరిగెత్తక ఉంచుకున్న నిరాశని
మోసుకెళుతున్న సంకెళ్ళు జ్ఞప్తి చేసే నిస్సహాయతని 
గీసుకున్న పరిధులను దాటలేని అడుగులని
చట్రంలో చిక్కుకున్న ఆలోచనా ధోరణని 

కాలంలో కాలిపోతున్నసున్నితపు మనసుని
నా వాళ్ళపై వస్తే కప్పేసిన అసూయ ఛాయలని
మసి పూసిన ముసుగుల మధ్య దాగి ఉన్న మనిషిని 
పొటీ పరగుల మధ్య తీసుకుంటున్న విశ్రాంతిని 
వెర్రి ఆశల వెలుగులో వెతుకుతున్న బ్రతుకుని

Tuesday, February 19, 2013

బైకు బాబులం

బైకు బాబులం మేము బైకు బాబులం
గతుకు దారుల్లో గాలి తిరుగుల్ల వీరులం
కారు సందుల్లో దూరి, దూసుకెళ్ళే ధీరులం
వానలో తడిసి  ఎండకు మండే యోధులం
పొగ ప్రయాణంలో ప్రాణాయామ యోగులం

ఆమడ దూరం దాక ఆగి ఉన్న
వాహనాల వాహినిలో ఈదుకుంటూ 
బయట పడడం మా ప్రత్యేకత
అందుకే  అయ్యాం బైకు బాబులం

ఇంటిలో ఉన్నవారి సంఖ్య పెరిగితే
ఊరు తిప్పడానికి కారు కొనలాని అయోమయం
ఇందన ధరలు ఇబ్బుడి ముబ్బుడిగా పెంచితే
ఇరుకున పడతామని ఆగిపోయాం

ఉద్యోగ స్థలం ఊరికి ఆ చివర ఉంటే
ప్రమాదాలు ప్రతి నిత్యం పొంచుంటే
జీతం సరిపోదు ఇంకో రెండు చక్రాలు పెంచాలంటే
అందుకే  అయ్యాం బైకు బాబులం
బైకు బాబులం మేము బైకు బాబులం

Saturday, January 19, 2013

సాఫ్ట్ వేర్ ఇంజినీర్

వారం పొడుగునా ఊడిగం చేస్తాం
వారాంతంలో వంద పెట్టి సినిమా చూస్తాం 
సందు దొరికితే విందు భోజనం
విపరీతంగా పెరిగాం అంటూ విసుక్కోవడం

షాపింగ్ పేరుతో సగం జీతం 
మిగతా మొత్తం ఇంటి నిమిత్తం
హైకుల కోసం వెర్రి చూపులు 
నిద్దర లేస్తే వెధవ పరుగులు 

లంచ్ దగ్గర లక్ష విశ్లేషణలు 
చెయ్యాల్సి వస్తే చెత్త సాకులు
ప్రపంచం అంతా చదివేస్తుంటాం 
పక్కింట్టోల్లేమో పట్టరు పాపం

అన్నీ తెలుసని అనేసుకుంటాం
బావిలో కప్పలా బ్రతికేస్తుంటాం
మిడిమిడి జ్ఞానం మాకే సొంతం 
మేమే మేమే భావి భారతం



Thursday, December 13, 2012

నేడు - రేపు

రేపెంటో తెలిసిపోతే 
నేడెందుకు దండగా!
కలలన్నీ కల్ల కావు 
కష్టం తోడుండగా

ఆశ ఆగిపోతే 
శ్వాసకర్ధమెముంది?
భయపడుతూ ముందుకెళితే
బ్రతుకు జారిపోతుంది

ఇటుక ఇటుక చేరకుంటే 
ఇల్లు ఎలా పుడుతుంది?
రోజు రోజు కలిస్తేనే 
ఉనికి ఉనికి తెలుస్తుంది  

Tuesday, November 6, 2012

ఒక్క క్షణం

ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో
సేద తీరుతున్నా అలసి ఉన్నాను
ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో 
వెతుకుతున్నా నాలోని నన్ను 

గతమిచ్చిన అనుభవాలు
ఓటమి  నేర్పిన గుణపాఠాలు
చెలిమి కోరుతూ చేదు నిజాలు
రేపటికై దాచిన ఆశల అందాలు

గుండె లోతులో నిప్పురవ్వలు
గుప్పెడు బిగిస్తూ కొత్త బాసలు
కనులు మూస్తే ఊహల గుసగుసలు
పరిగెత్తే కాలం స్తంబించిన పోకడలు

ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో
సేద తీరుతున్నా అలసి ఉన్నాను
ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో 
వెతుకుతున్నా నాలోని నన్ను 

Wednesday, October 10, 2012

బిందువు


జగతి పురోగతికి శ్రామికులైన
స్పూర్తి ప్రధాత మూర్తులెందరో

అశేష జన వాహిని ఆశల దాహం
తీర్చే మహా సముద్రపు మూలం ఎక్కడో?

కారు చీకటిలో దారి తెలియక
కాల చక్రం క్రింద నలిగితే 
కర్మ మార్గం దారి చూపుతూ
కాలిపోయిన క్రొవొత్తులెందరో 

నర నరాలలో నా స్వార్ధం
నలుగురు మోస్తారు 
అదే పరమార్ధం
నడుమ ఎలా నడుస్తామో 
అంత వరకే మన ఇష్టం

అశేష జన వాహిని ఆశల దాహం
తీర్చే మహా సముద్రపు మూలం ఎక్కడో?
మూలం కాదు ప్రశ్న
నేనూ ఓ బిందువ్వాలనే తృష్ణ 




Tuesday, September 25, 2012

జీతం రోజు

ఇదిగో... ఇదిగో... జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో... ఇదిగో... జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు

మద్దెల దరువులా వాయిస్తూ అద్దెల బరువులు
సొంత గూడుకై గొప్పగ చేసిన అప్పుల తిప్పలు
భవిష్యత్తుపై భాద్యత దాచిన డబ్బుల లెక్కలు 
మినహాయిస్తే మిగిలిన మొత్తం వేయి పదులు.

సినిమాకెళితే జొన్నల ఖరీదు వందలు
హోటలుకెలితే కోటలు దాటే రేటులు
బట్టలు కొన్నా జేబుకు తప్పవు చిల్లులు
దీనికి తోడు అన్నిటి మీదా వ్యాటులు

అన్ని ఖర్చులకు కార్డు గీకుతాం
నెలంతా అలాగే బతికేస్తాం
ఈ రోజు మాత్రం దున్నేస్తాం
ప్రపంచానికే దశ నిర్దేశిస్తాం

ఇదిగో ఇదిగో జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో ఇదిగో జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు


Wednesday, August 15, 2012

స్వాతంత్రం

కుప్పి గెంతులేసే కార్యక్రమాలు వస్తే
కళ్ళు అప్పగించి కేరింతలు కొడతాం
కూచిపూడి  చూపిస్తే రిమోటు మీట నొక్కుతాం 
జీవిత కాలం చాలని రాష్ట్రానికో నృత్యం
అయినా గాని అక్కర్లేదు - ఇదే మన అగత్యం 

రోగమొస్తే దిక్కు లేదు;బిక్కుమంటూ బతికేస్తాం 
దోచేస్తే హక్కు లేదు; ఎవర్ని నిలదీస్తాం?
బడులేమో  మూతబడ్డాయ్; బ్రతుకులేమో పాతబడ్డాయ్
అరవై కోట్ల మందికి అసలు మరుగు దొడ్లే లేవాయ్
రోడ్లంతా గుంతలు; ప్రజాస్వామ్య నియంతలు! 

మరో పుట్టిన పండుగ వచ్చేసింది 
మరో ప్రపంచం అడిగిన శ్రీ శ్రీ
మట్టి కాదు మనుషులన్న గురజాడ
ఏదేశమేగినా అంటూ ఎలుగెత్తిన రాయప్రోలు
జాగృతి చెందిన జాతిని కోరిన విశ్వ కవి
ఎంత వరకు తీరాయి మీ కోరికలు?




Thursday, July 12, 2012

ఓటమి

గెలిచినోడి దగ్గరేముంది
గెలుపు మీద వలపు తప్ప
ఓడినోడి కాడ చూడు
ఉన్నదసలు విషయమంతా
వాడి దగ్గరేముంది?
ఓటమంటె భయం తప్ప
వీడి దగ్గర ఉంటుంది
అసలు సిసలు ఆకలంతా

విజయంకై పడే తపన
పడిలేస్తూ పడే వేదన
నేటి మీద కసి ఉన్నది
రేపటిపై ఆశున్నది
గుండె నిండా బరువున్నది
గమ్యంకై పరుగున్నది
కంటి నిండా కలలున్నవి
లోలోపల దాగి ఉన్న దిగులున్నది
ఊరిస్తూ ఉనికున్నది
కడ వరకు కధ ఉన్నది
ఓడినోడి కాడ చూడు
ఉన్నదసలు విషయమంతా