Wednesday, July 24, 2013

విశ్రాంతి

ఆలోచన అంచులు దాటి వ్రాయనీ ఈ కవితని 
వెర్రి ఆశల వెలుగులో వెతుకుతున్న బ్రతుకుని 
గుండె  గూడులో దాగిన గోడుల గాధలని 
మారిన కాలం మరుగున పెట్టిన మమతలని 

ఎండమావుల వెనుక పరిగెత్తక ఉంచుకున్న నిరాశని
మోసుకెళుతున్న సంకెళ్ళు జ్ఞప్తి చేసే నిస్సహాయతని 
గీసుకున్న పరిధులను దాటలేని అడుగులని
చట్రంలో చిక్కుకున్న ఆలోచనా ధోరణని 

కాలంలో కాలిపోతున్నసున్నితపు మనసుని
నా వాళ్ళపై వస్తే కప్పేసిన అసూయ ఛాయలని
మసి పూసిన ముసుగుల మధ్య దాగి ఉన్న మనిషిని 
పొటీ పరగుల మధ్య తీసుకుంటున్న విశ్రాంతిని 
వెర్రి ఆశల వెలుగులో వెతుకుతున్న బ్రతుకుని

Wednesday, March 20, 2013

Dreamer and Seeker

Through the emptiness of my existence
And the quenching of my thirst
Through the beastliness of my lust
And the benevolence of my love
I am a dreamer and a seeker

Through the insignificance of my action
And the importance of my inaction
Through all the sins deep inside my being
And the good acts that went out to the world
I am a dreamer and a seeker

Through all the castles built in air
And the huts built on earth
Through all the love I gave in vain
And the undeserving love I got in pain
I am a dreamer and a seeker

A heart which takes me is what I dream
A dent before I leave is what I seek
A life of Love is what I dream
A world of Work is what I seek



Tuesday, February 19, 2013

బైకు బాబులం

బైకు బాబులం మేము బైకు బాబులం
గతుకు దారుల్లో గాలి తిరుగుల్ల వీరులం
కారు సందుల్లో దూరి, దూసుకెళ్ళే ధీరులం
వానలో తడిసి  ఎండకు మండే యోధులం
పొగ ప్రయాణంలో ప్రాణాయామ యోగులం

ఆమడ దూరం దాక ఆగి ఉన్న
వాహనాల వాహినిలో ఈదుకుంటూ 
బయట పడడం మా ప్రత్యేకత
అందుకే  అయ్యాం బైకు బాబులం

ఇంటిలో ఉన్నవారి సంఖ్య పెరిగితే
ఊరు తిప్పడానికి కారు కొనలాని అయోమయం
ఇందన ధరలు ఇబ్బుడి ముబ్బుడిగా పెంచితే
ఇరుకున పడతామని ఆగిపోయాం

ఉద్యోగ స్థలం ఊరికి ఆ చివర ఉంటే
ప్రమాదాలు ప్రతి నిత్యం పొంచుంటే
జీతం సరిపోదు ఇంకో రెండు చక్రాలు పెంచాలంటే
అందుకే  అయ్యాం బైకు బాబులం
బైకు బాబులం మేము బైకు బాబులం

Saturday, January 19, 2013

సాఫ్ట్ వేర్ ఇంజినీర్

వారం పొడుగునా ఊడిగం చేస్తాం
వారాంతంలో వంద పెట్టి సినిమా చూస్తాం 
సందు దొరికితే విందు భోజనం
విపరీతంగా పెరిగాం అంటూ విసుక్కోవడం

షాపింగ్ పేరుతో సగం జీతం 
మిగతా మొత్తం ఇంటి నిమిత్తం
హైకుల కోసం వెర్రి చూపులు 
నిద్దర లేస్తే వెధవ పరుగులు 

లంచ్ దగ్గర లక్ష విశ్లేషణలు 
చెయ్యాల్సి వస్తే చెత్త సాకులు
ప్రపంచం అంతా చదివేస్తుంటాం 
పక్కింట్టోల్లేమో పట్టరు పాపం

అన్నీ తెలుసని అనేసుకుంటాం
బావిలో కప్పలా బ్రతికేస్తుంటాం
మిడిమిడి జ్ఞానం మాకే సొంతం 
మేమే మేమే భావి భారతం



Thursday, December 13, 2012

నేడు - రేపు

రేపెంటో తెలిసిపోతే 
నేడెందుకు దండగా!
కలలన్నీ కల్ల కావు 
కష్టం తోడుండగా

ఆశ ఆగిపోతే 
శ్వాసకర్ధమెముంది?
భయపడుతూ ముందుకెళితే
బ్రతుకు జారిపోతుంది

ఇటుక ఇటుక చేరకుంటే 
ఇల్లు ఎలా పుడుతుంది?
రోజు రోజు కలిస్తేనే 
ఉనికి ఉనికి తెలుస్తుంది  

Tuesday, November 6, 2012

ఒక్క క్షణం

ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో
సేద తీరుతున్నా అలసి ఉన్నాను
ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో 
వెతుకుతున్నా నాలోని నన్ను 

గతమిచ్చిన అనుభవాలు
ఓటమి  నేర్పిన గుణపాఠాలు
చెలిమి కోరుతూ చేదు నిజాలు
రేపటికై దాచిన ఆశల అందాలు

గుండె లోతులో నిప్పురవ్వలు
గుప్పెడు బిగిస్తూ కొత్త బాసలు
కనులు మూస్తే ఊహల గుసగుసలు
పరిగెత్తే కాలం స్తంబించిన పోకడలు

ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో
సేద తీరుతున్నా అలసి ఉన్నాను
ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో 
వెతుకుతున్నా నాలోని నన్ను 

Wednesday, October 10, 2012

బిందువు


జగతి పురోగతికి శ్రామికులైన
స్పూర్తి ప్రధాత మూర్తులెందరో

అశేష జన వాహిని ఆశల దాహం
తీర్చే మహా సముద్రపు మూలం ఎక్కడో?

కారు చీకటిలో దారి తెలియక
కాల చక్రం క్రింద నలిగితే 
కర్మ మార్గం దారి చూపుతూ
కాలిపోయిన క్రొవొత్తులెందరో 

నర నరాలలో నా స్వార్ధం
నలుగురు మోస్తారు 
అదే పరమార్ధం
నడుమ ఎలా నడుస్తామో 
అంత వరకే మన ఇష్టం

అశేష జన వాహిని ఆశల దాహం
తీర్చే మహా సముద్రపు మూలం ఎక్కడో?
మూలం కాదు ప్రశ్న
నేనూ ఓ బిందువ్వాలనే తృష్ణ 




Tuesday, September 25, 2012

జీతం రోజు

ఇదిగో... ఇదిగో... జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో... ఇదిగో... జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు

మద్దెల దరువులా వాయిస్తూ అద్దెల బరువులు
సొంత గూడుకై గొప్పగ చేసిన అప్పుల తిప్పలు
భవిష్యత్తుపై భాద్యత దాచిన డబ్బుల లెక్కలు 
మినహాయిస్తే మిగిలిన మొత్తం వేయి పదులు.

సినిమాకెళితే జొన్నల ఖరీదు వందలు
హోటలుకెలితే కోటలు దాటే రేటులు
బట్టలు కొన్నా జేబుకు తప్పవు చిల్లులు
దీనికి తోడు అన్నిటి మీదా వ్యాటులు

అన్ని ఖర్చులకు కార్డు గీకుతాం
నెలంతా అలాగే బతికేస్తాం
ఈ రోజు మాత్రం దున్నేస్తాం
ప్రపంచానికే దశ నిర్దేశిస్తాం

ఇదిగో ఇదిగో జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో ఇదిగో జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు


Wednesday, August 15, 2012

స్వాతంత్రం

కుప్పి గెంతులేసే కార్యక్రమాలు వస్తే
కళ్ళు అప్పగించి కేరింతలు కొడతాం
కూచిపూడి  చూపిస్తే రిమోటు మీట నొక్కుతాం 
జీవిత కాలం చాలని రాష్ట్రానికో నృత్యం
అయినా గాని అక్కర్లేదు - ఇదే మన అగత్యం 

రోగమొస్తే దిక్కు లేదు;బిక్కుమంటూ బతికేస్తాం 
దోచేస్తే హక్కు లేదు; ఎవర్ని నిలదీస్తాం?
బడులేమో  మూతబడ్డాయ్; బ్రతుకులేమో పాతబడ్డాయ్
అరవై కోట్ల మందికి అసలు మరుగు దొడ్లే లేవాయ్
రోడ్లంతా గుంతలు; ప్రజాస్వామ్య నియంతలు! 

మరో పుట్టిన పండుగ వచ్చేసింది 
మరో ప్రపంచం అడిగిన శ్రీ శ్రీ
మట్టి కాదు మనుషులన్న గురజాడ
ఏదేశమేగినా అంటూ ఎలుగెత్తిన రాయప్రోలు
జాగృతి చెందిన జాతిని కోరిన విశ్వ కవి
ఎంత వరకు తీరాయి మీ కోరికలు?




Thursday, July 12, 2012

ఓటమి

గెలిచినోడి దగ్గరేముంది
గెలుపు మీద వలపు తప్ప
ఓడినోడి కాడ చూడు
ఉన్నదసలు విషయమంతా
వాడి దగ్గరేముంది?
ఓటమంటె భయం తప్ప
వీడి దగ్గర ఉంటుంది
అసలు సిసలు ఆకలంతా

విజయంకై పడే తపన
పడిలేస్తూ పడే వేదన
నేటి మీద కసి ఉన్నది
రేపటిపై ఆశున్నది
గుండె నిండా బరువున్నది
గమ్యంకై పరుగున్నది
కంటి నిండా కలలున్నవి
లోలోపల దాగి ఉన్న దిగులున్నది
ఊరిస్తూ ఉనికున్నది
కడ వరకు కధ ఉన్నది
ఓడినోడి కాడ చూడు
ఉన్నదసలు విషయమంతా