Thursday, December 13, 2012

నేడు - రేపు

రేపెంటో తెలిసిపోతే 
నేడెందుకు దండగా!
కలలన్నీ కల్ల కావు 
కష్టం తోడుండగా

ఆశ ఆగిపోతే 
శ్వాసకర్ధమెముంది?
భయపడుతూ ముందుకెళితే
బ్రతుకు జారిపోతుంది

ఇటుక ఇటుక చేరకుంటే 
ఇల్లు ఎలా పుడుతుంది?
రోజు రోజు కలిస్తేనే 
ఉనికి ఉనికి తెలుస్తుంది  

Tuesday, November 6, 2012

ఒక్క క్షణం

ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో
సేద తీరుతున్నా అలసి ఉన్నాను
ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో 
వెతుకుతున్నా నాలోని నన్ను 

గతమిచ్చిన అనుభవాలు
ఓటమి  నేర్పిన గుణపాఠాలు
చెలిమి కోరుతూ చేదు నిజాలు
రేపటికై దాచిన ఆశల అందాలు

గుండె లోతులో నిప్పురవ్వలు
గుప్పెడు బిగిస్తూ కొత్త బాసలు
కనులు మూస్తే ఊహల గుసగుసలు
పరిగెత్తే కాలం స్తంబించిన పోకడలు

ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో
సేద తీరుతున్నా అలసి ఉన్నాను
ఒక్క క్షణం నిశ్శబ్దపు కౌగిలిలో 
వెతుకుతున్నా నాలోని నన్ను 

Wednesday, October 10, 2012

బిందువు


జగతి పురోగతికి శ్రామికులైన
స్పూర్తి ప్రధాత మూర్తులెందరో

అశేష జన వాహిని ఆశల దాహం
తీర్చే మహా సముద్రపు మూలం ఎక్కడో?

కారు చీకటిలో దారి తెలియక
కాల చక్రం క్రింద నలిగితే 
కర్మ మార్గం దారి చూపుతూ
కాలిపోయిన క్రొవొత్తులెందరో 

నర నరాలలో నా స్వార్ధం
నలుగురు మోస్తారు 
అదే పరమార్ధం
నడుమ ఎలా నడుస్తామో 
అంత వరకే మన ఇష్టం

అశేష జన వాహిని ఆశల దాహం
తీర్చే మహా సముద్రపు మూలం ఎక్కడో?
మూలం కాదు ప్రశ్న
నేనూ ఓ బిందువ్వాలనే తృష్ణ 




Tuesday, September 25, 2012

జీతం రోజు

ఇదిగో... ఇదిగో... జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో... ఇదిగో... జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు

మద్దెల దరువులా వాయిస్తూ అద్దెల బరువులు
సొంత గూడుకై గొప్పగ చేసిన అప్పుల తిప్పలు
భవిష్యత్తుపై భాద్యత దాచిన డబ్బుల లెక్కలు 
మినహాయిస్తే మిగిలిన మొత్తం వేయి పదులు.

సినిమాకెళితే జొన్నల ఖరీదు వందలు
హోటలుకెలితే కోటలు దాటే రేటులు
బట్టలు కొన్నా జేబుకు తప్పవు చిల్లులు
దీనికి తోడు అన్నిటి మీదా వ్యాటులు

అన్ని ఖర్చులకు కార్డు గీకుతాం
నెలంతా అలాగే బతికేస్తాం
ఈ రోజు మాత్రం దున్నేస్తాం
ప్రపంచానికే దశ నిర్దేశిస్తాం

ఇదిగో ఇదిగో జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో ఇదిగో జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు


Wednesday, August 15, 2012

స్వాతంత్రం

కుప్పి గెంతులేసే కార్యక్రమాలు వస్తే
కళ్ళు అప్పగించి కేరింతలు కొడతాం
కూచిపూడి  చూపిస్తే రిమోటు మీట నొక్కుతాం 
జీవిత కాలం చాలని రాష్ట్రానికో నృత్యం
అయినా గాని అక్కర్లేదు - ఇదే మన అగత్యం 

రోగమొస్తే దిక్కు లేదు;బిక్కుమంటూ బతికేస్తాం 
దోచేస్తే హక్కు లేదు; ఎవర్ని నిలదీస్తాం?
బడులేమో  మూతబడ్డాయ్; బ్రతుకులేమో పాతబడ్డాయ్
అరవై కోట్ల మందికి అసలు మరుగు దొడ్లే లేవాయ్
రోడ్లంతా గుంతలు; ప్రజాస్వామ్య నియంతలు! 

మరో పుట్టిన పండుగ వచ్చేసింది 
మరో ప్రపంచం అడిగిన శ్రీ శ్రీ
మట్టి కాదు మనుషులన్న గురజాడ
ఏదేశమేగినా అంటూ ఎలుగెత్తిన రాయప్రోలు
జాగృతి చెందిన జాతిని కోరిన విశ్వ కవి
ఎంత వరకు తీరాయి మీ కోరికలు?




Thursday, July 12, 2012

ఓటమి

గెలిచినోడి దగ్గరేముంది
గెలుపు మీద వలపు తప్ప
ఓడినోడి కాడ చూడు
ఉన్నదసలు విషయమంతా
వాడి దగ్గరేముంది?
ఓటమంటె భయం తప్ప
వీడి దగ్గర ఉంటుంది
అసలు సిసలు ఆకలంతా

విజయంకై పడే తపన
పడిలేస్తూ పడే వేదన
నేటి మీద కసి ఉన్నది
రేపటిపై ఆశున్నది
గుండె నిండా బరువున్నది
గమ్యంకై పరుగున్నది
కంటి నిండా కలలున్నవి
లోలోపల దాగి ఉన్న దిగులున్నది
ఊరిస్తూ ఉనికున్నది
కడ వరకు కధ ఉన్నది
ఓడినోడి కాడ చూడు
ఉన్నదసలు విషయమంతా

Friday, June 29, 2012

నిరీక్షణ

నిను చూసే ఆ క్షణం
లయ తప్పును నా హృదయం
నీ తలపులలో గడిపిన కాలం
నా గుండె లోతులలో పదిలం

నీ రూపు నాకు తెలియదు
నా నిరీక్షణ ముగియదు
నా అర్హత చాలదు
అయినా ఆశ చావదు

నాకంటూ ఓ ఉనికి
అనుకుంటూ బ్రతికి
నీ కొరకై వ్రెతికి
నిట్టూర్పే కడకి

ఈ జన్మకి ఇంతేలే
అని పలికె నా మెదడు
ఎవరి రాతఎవరికెరుక
అని ఊరించే నా మనసు

నా కలలు ఆగవు
నా మనసు మారదు
నా ఉనికి నిండదు
నువ్వు - నీకై నా నిరీక్షణ

Saturday, April 28, 2012

విన్న పాట

విన్న పాటే మళ్ళీ మళ్ళీ వింటావు
పాత చిత్రాలనే పదే పదే పలకరిస్తావు
అవే అవే ఆలోచనలను ఆస్వాదిస్తావు
ఏమైంది మిత్రమా నీ మనసుకి ?

ఉరికి ఉరికి ఉనికి మరచినపుడు
విన్న పాట ఊసులే ఊరటనిస్తున్నాయి
వేగం పెంచే పరుగులో రాగం మరచిన మనసుకి
మమతల లోతులో దాగిన మనిషిని చూపిస్తున్నాయి

మూలం కాస్తా గాలికి వదిలి తియ్యని భాషకు
తీరని లోటును తెచ్చిన తప్పును దిద్దాలంటే
చూసిన కధలే మళ్ళీ మళ్ళీ చూడాలేమో
చదివిన పాఠమే మళ్ళీ మళ్ళీ చదవాలేమో

గమ్యం తెలియని గమనంలో
హంగుల పొంగుల కాలంలో
స్వార్ధం పెరిగిన సంఘంలో
ఉనికికి అర్ధం వెతకాలంటే
మాటల కొటలు దాటాలేమో
మనసుల లోతులు ఈదాలేమో

గమనిక: అనుకున్నంత అందంగా ఈ కవిత రాలేదు. అతికినట్టు అనిపిస్తే మన్నించ మనవి.

Tuesday, April 3, 2012

We are all the same inside

Inspired from the Telugu poem  "Brahmam Okkate Parabrahmam Okkate"  by Sri Tallapaka Annamacharyulu learnt during school days.

We are all the same inside
Pizza or Pickled Rice - it's the same hunger
Foam Bed or Bare Floor - it's the same sleep
Money or No Money - all are humans

Sun doesn't know the colour of our skin
Rain doesn't know the caste created by us
Fire doesn't discriminate us based on religion
Air doesn't change its nature based on intellect

Propelled by Greed,Corrupted by Power
Maddened by Lust, Wounded by Anger
Distanced by Ego, Maligned by Jealousy
It is We who created the differences

A shoulder to lean in times of difficulty
A word of encouragement when you need it the most
A helping hand when going gets tough
A light hearted joke to cheer up the day
All of us need the same things

Birth has brought us into this World
Death will definitely deliver its verdict
What We do in between will define us
We are all the same inside


Thursday, March 29, 2012

కార్పొరేటు వల

నిన్నంతా నిట్టూర్పులు 
నేడేమో నింగినంటే ఊహలు 
ఒక్క క్షణం అయోమయం 
మరు క్షణం ఆశల వలయం

గెలుపోస్తే గొప్పలు 
లేకపోతే తిప్పలు 
ఎన్నెనో చిక్కులు 
వింతవింత తిక్కలు 

ఒడిదుడుకుల ఓడలు 
గాలిలో మేడలు 
కోటలో పాగాలు 
పూటకో రాగాలు

అరిగిపోయే ఆరోగ్యం 
అంతుచిక్కని గమ్యం  
కరిగిపోయే యవ్వనం 
తిరిగిరాని జీవితం 








Friday, March 23, 2012

అందని ద్రాక్ష చేదు

శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  చిన్నారులకు చిన్న పాటగా పాడేందుకు వీలుగా వ్రాసిన కవిత.  మనము చిన్నప్పుడు విన్న "అందని ద్రాక్షను చేదు" కధనే ఇలా వ్రాసాను. తప్పులను మన్నించ మనవి.


కధ ఒకటుంది ఊ కొడతారా!
చుక్కలు చూపుతూ చక్కగా చెబుతా
బుద్దిగ కూకోని శ్రద్దగా మీరు మాటింటారా?

చీమలు దూరని చిట్టడవంటా!
కాకులు దూరని కారడవంటా!
అక్కడ ఉందో టక్కరి నక్క
టక్కు టమారం తెలిసిన నక్క

అడవిలో ఉందో ద్రాక్షల చెట్టు
నల్లని ద్రాక్షల  పచ్చని చెట్టు 
పళ్ళను చూచి ఊరేను నోరు 
 తిని తీరాలంటూ మదిలో పోరు

ఎగిరిపట్టగా పళ్ళు అందక
నక్క గెంతెను విసుగు చెందక 
ఎంత చేసిన పళ్ళు దొరకక 
తగ్గ సాగేను ఒంట్లో ఓపిక

అలసి అలసి మనసు మారెను 
ద్రాక్ష చేదని తలవ సాగెను 
అందని ద్రాక్షను చేదని తలచెను 
ఆకలితోనే ఇంటికి చేరెను



Monday, February 27, 2012

జీవిత కాలం

ఎనబై ఏళ్ల పరిమాణం 
తెలియని పరిణామాల తోరణం 
గమ్యం ఏరుగని ప్రయాణం
ఆగని ఆశల బ్రమణం

బాల్యం మొత్తం చదువుల గొడవలు 
యవ్వనమంతా తరగని పరుగులు 
నడి వయస్సేమో అప్పుల నీడలు 
వృద్ధాప్యంలోనూ వీడని పీడలు

ఒక వైపేమో ఆకలి చావుల భాదలు 
ఇటుప్రక్కేమో చుక్కలు తాకే మేడలు  
కొందరికేమో ఎన్నడు చూడని అవకాశాలు 
మిగతా వారు మిన్నును చూస్తూ నిట్టూర్పులు  

ఉన్నది ఒకటే జీవిత కాలం 
మార్పులు చేర్పులు చూడక మానం 
ప్రపంచమంతా మారే వైనం 
ఈ జీవిత కాలంలోనే చూడుట తధ్యం 




 

 

Saturday, February 25, 2012

Where does God exist?

Who are You? I asked, Where do You reside?
Some say You are a tenant in the temple
Some tell me You can be found in church
Some others say You must be residing in a mosque
Some other people are busy trying to prove that You don't exist
But, I can feel You day in and day out
I hear You in the beat of my heart
Are You a figment of my imagination? Or real?
Whom should I believe? Them or myself?

I dwell in the hearts of Men, He answered
For, that is the last place they search for Me
Close your eyes and you can see Me
Help your neighbour to feed Me
Ask your heart, and I shall answer
Why do you search everywhere? I am always with you!
And, What is there in a name?
That is about Language and not Me

Thursday, February 23, 2012

చర్య - ప్రతిచర్య

కడుపునిండినోడికేమి కధలెన్నో చెబుతాడు
కడుపు కాలినోడి వ్యధ ఎవడడిగేడు? 

బైకు మీద తిరిగినోడు కొత్త కారు కొన్నాక
వెనక వచ్చు పొగ సంగతి మరిచాడు
కాలి నడక వెళ్ళు వాడు కదా
బయట గాలి వల్ల జబ్బు పడతాడు

బిస్లేరీ నీరు మాత్రమే, నేను త్రాగి బ్రతుకుతాను
వాడి కొరకు ఉన్నాయిగా, నే మురికి చేసి ఉంచి ఉన్న నది నీరు
నా ఇంటికి వస్తాయి  బోరింగు నీరు
వీధి చివర, కొళాయి ప్రక్కన పోరు పడుతు అగుపిస్తారు; ఎవరు వారు ?

కుక్క పిల్ల కొనుటకైతే, పాతిక వేలు పెడతాను
పనివాడు అడిగితే - నోరు వెల్లబెడతాను 
పిజ్జా, బర్గరులు నా హక్కు
ఏమైనా మిగిలితే; వాడి లక్కు

కడుపునిండినోడికేమి కధలెన్నో చెబుతాడు
కడుపు కాలినోడి వ్యధ ఎవడడిగేడు?






 

Sunday, February 12, 2012

నా కోరికలు

పుట్టిన ప్రతి బిడ్డకి బాల్యం 
పని ఏదైనా పరువుగా బ్రతకడం 
ఆకలేస్తే ఇంత అన్నం
స్పందించే హృదయం 
చేతనైతే సాయం 
సాధ్యమైనంత వరకు నెయ్యం 
గొప్పవారిని గౌరవించే  నైజం 
మంచివారిని ప్రేమించే భావం
కష్టాలొచ్చినప్పుడు హాస్యం  
కలిసొచ్చినప్పుడు ఓ కవిత్వం


Friday, January 20, 2012

చిరు కవిత

ఉనికికై వ్రెతుకులాట
బ్రతుకుకై ప్రాకులాట 
అశాశ్వతాలకై దేవులాట 
ఏమిటీ వింత ఆట?
ఏది నా బాట? 

చంటి పాపకు లాలి పాట
దాహార్తికి నీరే ఊరట 
తోటి వానితొ ఓ మంచి మాట 
మనిషికి మమతే ముచ్చట
ప్రపంచమో పూల తోట 
ముల్లుంటే మాత్రం ఎంటట?
అంతకు మించేమి లేదట!  
ఇదే ఇదే నీ దారట!